ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం


Ens Balu
8
Vizianagaram
2022-08-02 09:15:31

 నూతన చట్టాలకు అనుగుణంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఓటర్ జాబితాలో నమోదైన ఓటరు  కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్  పేర్కొన్నారు. మంగళ వారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరం లో  ఓటర్ ఆధార్ సంధాన ప్రక్రియ పై పాత్రికేయుల  సమావేశంలో జేసీ మాట్లాడారు.  ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లు 2023 మార్చి 31 నాటికి స్వచ్ఛందంగా తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం నూతనంగా ఫారం-6 బిని ప్రవేశపెట్టామని  తెలిపారు.  ఆధార్ నంబర్ అనుసంధానం స్వచ్చందమేనని   సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం ఉండదని  స్పష్టం చేశారు. దోషరహితమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఓటరు సహకరించాలని  అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

ఓటరు నమోదుకు 4 సార్లు అవకాశం :
 2023 ఓటర్ల జాబితా వార్షిక సవరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో   ఓటరుగా నమోదు కావడానికి ముందస్తుగా దరఖాస్తు సమర్పించవచ్చని ఆయన సూచించారు.   ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం సంవత్సరంలో నాలుగు సార్లు అవకాశం కల్పిస్తుందని జే.సి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 17 సంవత్సరాలు పైబడిన యువత ఓటర్ల జాబితాలో పేర్లను నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధన  కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. జనవరి 1వ తేదీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వలన 18 సంవత్సరాలు నిండినప్పటికి పలు ఎన్నికలలో యువత ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఆగష్టు 1 నుండి కొత్త దరఖాస్తులు:
ఓటరు నమోదు ఫారాలు మరింత సులభంగా రూపొందించి ఆగష్టు 1వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకువస్తుందని సంయుక్త  కలెక్టర్ చెప్పారు. ఓటరుగా నమోదుకు ఫారం - 6, పేరు తొలగింపుకు ఫారం - 7, వివరాలను సరిదిద్దడానికి ఫారం -8, ఆధార్ కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానం చేయడానికి ఫారం - 6బి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పటికే పాత నమూనా దరఖాస్తులో దాఖలు చేసిన వారు కొత్తవి సమర్పించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ లో ప్రారంభం కానున్న సవరణ కార్యకలాపాల్లో ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ క్రింద ముసాయిదా ఓటర్ల జాబితాలో క్లెయింటు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి ఒక నెల వ్యవధి అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యెక సమ్మరీ రివిజన్ :  
ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 షెడ్యూల్ ప్రకారం దోషరహితమైన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుండి అక్టోబర్ 24 వ తేదీ వరకు చేపడతామన్నారు. నవంబర్ 9వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించి అప్పటి నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 26వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు. తదుపరి 2023 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని  తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్  రూపొందించిన 6, 6బి, 8  ఫారాలను  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గణపతి రావు, ఎన్నికల్ల పర్యవేక్షకులు మహేష్ , డి ఐ.పి.ఆర్ .ఓ  రమేష్   తదితరులు పాల్గొన్నారు.