ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సముద్ర మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులకు ఉపాది, వ్యాపార అవకాశాలు మెరుగుపడి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న తెలిపారు. శనివారం విజయనగరంలోని ఫిష్ సీడ్ ఫారంలో మత్య్స సంపద, వినియోగం, పథకం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారులు అభివృద్ధి, మత్స్య సంపద పెంపుదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా, వై.ఎస్.ఆర్. పెన్సన్ కానుక, మత్స్య సాగుబడి, కిసాన్ క్రెడిట్ కార్డులు, పవర్ సబ్సిడీ వంటి ఎన్నో పధకాలు అమలు చేస్తోందని అన్నారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మాట్లాడుతూ, స్థానికంగా చేపల వినియోగం పెంచేందుకు మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి SC, ST, మహిళలకు 60శాతం, ఇతరలకు 40శాతం సబ్సిడీపై ఈ యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. ఔత్సాహిక మత్య్సకారులు ఇంకా ముందుకి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా లబ్ది పొంది వినూత్న, సాంకేతిక పద్దతిలో రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టం(RAS) ద్వారా చేపల పెంపకం చేయుచున్న మహిళా లబ్దిదారు. నాగమణి గారు తన యొక్క అనుభవాలు, RAS ప్రయోజనాలు విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డవలప్మెంట్ ఆఫీసర్ యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమారి, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.