సర్వేయర్ల సేవలు ప్రశంసనీయం


Ens Balu
6
Vizianagaram
2022-08-15 11:50:15

గ్రామ సర్వేయర్లు అమూల్యమైన సేవలను అందిస్తున్నారని విజయనగరం ఆర్డీవో ఎంవి సూర్యకళ కొనియాడారు. భూముల రీ సర్వేలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో,  గ్రామ సర్వేయర్లు, వీఆర్వోల సత్కార సభ సోమవారం జరిగింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్వేయర్లు, వీఆర్వోలను ఈ సందర్భంగా సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో సూర్యకళ మాట్లాడుతూ, రీ సర్వేలో మన జిల్లా ముందంజ లో వుండటానికి సర్వేయర్లు, వీఆర్వోలే కారణమని అభినందించారు. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం క్రింద చేపట్టిన భూముల రీ సర్వే కి ప్రభుత్వం  అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రీ సర్వే పూర్తి అయితే, చాలా వరకు భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్వేయర్ల పైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. సర్వేయర్లు, విఆర్వోలు అంకితభావంతో పని చేసి, సర్వేలో మన జిల్లాను అగ్రపథంలో నిలబెట్టాలని ఆర్డీవో కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే, భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, ఆర్డీవో కార్యాలయ ఏఓ ప్రభాకరరావు, పది మండలాల తాసిల్డార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, విఆర్వోలు పాల్గొన్నారు.