అనకాపల్లి జిల్లాలో 2024 లో జరిగే ఎన్నికల్లో గుడివాడ అమర్నాధ్ ఓడిన నాడే అనకాపల్లి ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పరుచురి భాస్కరరావు అన్నారు. మంగళవారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశాఖకు చెంది జనసేన నాయకులు బోలిశెట్టి సత్యన్నారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాధ్ అవాకులు చవాకులు పేలడం తగదన్నారు. తమ మూడేళ్ల అధికార సమయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో ప్రజలకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని నమ్మబలికిన వ్యక్తి నేడు దానిని అమ్ముకునేందుకు సిద్ధపడటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆరోపించారు. 25 ఎంపీలు ఉండికూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాడలేని దౌర్భాగ్య స్ధితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందన్నారు. పేరుకే కొత్త జిల్లాలు ఏర్పడినా ఎక్కడా అధికారికంగా ఎలాంటి వసతులు, జిల్లా స్థాయి కల్పన ఎక్కడచేపట్టలేకపోయారని దుయ్యబట్టారు. అమలు కానీ హామలు ప్రజల నెత్తిన రుద్ది అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారనే విషయాన్ని ముందు ప్రజలకు తెలియజేయాలన్నారు. జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో ఆ విషయం మా పార్టీ అధిష్టానం, తమ అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని..దానికోసం వైఎస్సార్సీపీ నేతలు ఆత్రుత పడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.