గత స్మృతులకు దర్పణంగా నిలిచేది చాయాచిత్రం మాత్రమేనని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వాల్తేర్ ఫోటోగ్రఫిక్ సొసైటీ స్థానిక వేమన మందిరంలో గురువారం ఏర్పాటుచేసిన మెగా ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అద్భుత అందాలను కళ్లకు కట్టినట్లు చూపించగల శక్తి సామర్థ్యం ఒక్క ఫోటోగ్రాఫర్ కి మాత్రమే వుందని అన్నారు. కాలానుగుణంగా ఫోటోగ్రఫీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి అని అన్నారు. డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చిన తరువాత చాయచిత్రాలు మరుగున పడిపోయాయి అని మంత్రి అమర్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టిల్ కెమెరాలతో ఫొటోలు తీసి, వాటిని చాయచిత్రాలుగా మలచి భద్రత పరచుకోవలసి అవసరం ఎంతైనా వుందని ఆయన అన్నారు. అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యానికి మరింత పదునుపెట్టి ఫోటోగ్రఫీ ఖ్యాతిని పెంచాలని అమర్ నాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక గుర్తింపు అవసరమని, వీరికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తామని మంత్రి అమర్ నాథ్ హామీ ఇచ్చారు.
పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఫొటోలు జీవితాలను మార్చేస్థాయని అన్నారు. పూర్వం ఫొటోలు మాత్రమే చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వారని చెప్పారు. రాజకీయ నాయకులను పదవులలో కూర్చో పెట్టాలన్నా, దించేయాన్నా ఆ శక్తి ఫొటోగ్రాఫర్లకు, వారు తీసిన ఫొటోలకు వుందని యార్లగడ్డ చమత్కరించారు. లీడర్ పత్రిక అధినేత రమణ మూర్తి మాట్లాడుతూ, పత్రికలో వార్త ఎంత ప్రధానమైనదైనా, ఆ వార్తకు సంబంధించిన ఫొటోనే పాఠకులు ముందుగా చూస్తారని, ఆ ఫొటో, ఆ వార్త సారాంశాన్ని వ్యక్తీకరిస్తుందని అన్నారు. నక్సల్స్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య ను తాను అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశానని, తాను నిజంగా ఆ ఇంటర్వ్యూ చేశానని తాను తీసిన ఫొటోల ద్వారానే బాహ్య ప్రపంచానికి తెలియచేశానని, అది ఫొటోకు వున్న గొప్పతనం అని రమణమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమానికి సొసైటీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ కోదండరామయ్యని,సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రసాదరావును మంత్రి అమర్ నాథ్ ఘనంగా సత్కరించారు. అంతకు ముందు ఫొటో ఎగ్జిబిషన్ లో పొందుపర చి న సుమారు 800 ఫొటోల ను మంత్రి అమర్ నాథ్ ,యార్లగడ్డ తదితరులు సందర్శించి నిర్వాహకుల ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సేత్ తదితరులు పాల్గొన్నారు.