ప్రభుత్వ వైద్య కళాశాలగా అవతరించనున్న జిల్లా కేంద్రాసుపత్రిలో త్వరలో అధునాతన ఆపరేషన్ థియేటర్ అందుబాటులో రానుంది. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్‌ను, సుమారు రూ.2.5కోట్ల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ వే సంస్థ ముందుకు వచ్చింది. పార్వతీపురానికి చెందిన స్వచ్ఛంద సంస్థ జన కల్యాణ సమాఖ్య కృషితో, ఈ సంస్థ జిల్లాలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. థియేటర్‌లో సి-ఆర్మ్, లాప్రోస్కోప్, ఎనలైజర్, రెండు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు తదితర అత్యాధునిక పరికరాలతోపాటు అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సు కూడా సమకూరనుంది. కేంద్రాసుపత్రిలో ఈ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి గురువారం పరిశీలించారు. ఏర్పాటు చేయనున్న పరికరాలు, వాటి పనితీరును అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కె.సీతారామరాజు, యునైటెడ్ వే, జెకెఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.