బర్డ్ ఆసుపత్రిలో ఓపీకి ప్రత్యేక యాప్


Ens Balu
6
Tirupati
2022-08-18 14:43:28

బర్డ్ ఆసుపత్రిలో ముంద‌స్తుగా ఓపి బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్‌ను త్వ‌రిత‌గ‌తిన రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి బ‌ర్డ్‌లో గురువారం సాయంత్రం బ‌ర్డ్ ఆస్పత్రి నిర్వహణపై ఈవో సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఎంతో నాణ్యమైన వైద్య సేవలు బ‌ర్డ్ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఓపి ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పద్ధతిలో బర్డ్ ఆసుపత్రిలోని ల్యాబ్‌ల‌ను అభివృద్ధి చేయాలని, ల్యాబ్‌ల‌కు అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు అందుతున్న భోజ‌నం నాణ్య‌త మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ‌ర్డ్ ఆసుపత్రిలో సెంట్రల్ యూపిస్‌ ఏర్పాటు చేయాలని, ఆటోమేషన్‌ ఆఫ్ ల్యాబ్ రిపోర్ట్స్ అందించే ప‌నులు పూర్తి చేయాలన్నారు. ల్యాబ్ మెటీరియల్స్, బ్లడ్ బ్యాంక్‌కు సంబంధించిన యంత్ర పరికరాలు తదితరాలను టెండర్ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఫుల్లీ ఆటో మేటెడ్‌ బయో కెమిస్ట్రీ మిషన్ ప్రారంభం
తిరుపతికి చెందిన  సాయి పవిత్ర మెడికల్ సర్వీసెస్ అధినేత‌  కటారు సుబ్రహ్మణ్యం బ‌హూక‌రించిన ఐదు లక్షల విలువ చేసే ఫుల్లీ ఆటో మేటెడ్ బయో కెమిస్ట్రీ మిషన్‌ను ఈవో గురువారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు ఈవో ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి విద్యార్థునుల‌ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థునుల‌ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణము త్వరితగతిన పూర్తి చేయాలని, ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయుర్వేద ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలతో ఆయ‌న మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.  జెఈవో  వీరబ్రహ్మం, బ‌ర్డ్‌ ప్రత్యేకాధికారి డాక్ట‌ర్‌ రెడ‌ప్ప‌రెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్ట‌ర్‌ మురళీకృష్ణ, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.