గోకులాష్టమి రోజునే కాకుండా రోజూ ప్రతి ఆలయం, ప్రతిఇంట్లో గోపూజ జరగాలన్నదే టీటీడీ లక్ష్యమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. గోపూజ నిర్వహించే ఆలయాలకు ఆర్థిక వనరులు లేకపోతే వాటికి తోడ్పాటు అందించే ఆలోచన కూడా చేస్తామని ఆయన చెప్పారు. గోకులాష్టమి సందర్భంగా శుక్రవారం టీటీడీ గోసంరక్షణ శాలలో గోకులాష్టమి - గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ కి కళాకారులు కోలాటాలు, పిల్లనగ్రోవులు, భజన బృందాలు ఘనంగా స్వాగతం పలికాయి. గజరాజులకు పండ్లు అందించిన అనంతరం సుబ్బారెడ్డి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సుబ్బారెడ్డి మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులతో అందరూ బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 200 ఆలయాలకు గోవులు, దూడలను దానంగా ఇచ్చామన్నారు. ఇంకా ఆలయాలు, మఠాలు ముందుకు వస్తే గోమాత దూడను ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గో పూజ విశిష్టతను భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అలిపిరి వద్ద సప్తగో ప్రదక్షణ మందిరాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. తిరుమలలో గత ఏడాది గోకులాష్టమి సందర్భంగా, నవనీత సేవను ప్రారంభించి భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ, రైతులకు ఆవులు, ఎద్దులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. గో ఆధారిత వ్యవసాయంతో పండిస్తున్న పంటలను రైతుల నుంచి టిటిడినే కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు.
అనంతరం సుబ్బారెడ్డి గోసంరక్షణ శాల లో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర దివ్య మహా మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత శ్రీ వేంకటేశ్వరదివ్య మహామంత్ర లిఖిత జపం పుస్తకాలను స్వామివారికి సమర్పించారు. అంతకుముందు అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరంలో వైవి సుబ్బారెడ్డి గోపూజలో పాల్గొన్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామివారి పూజలో పాల్గొని గోమాతలకు దాణా, మేత, పండ్లు అందించారు. అనంతరం పండితులు ఆయనకి వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, మొరం శెట్టి రాములు, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, ఎస్ వి గో సంరక్షణ కమిటీ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి, జెఈవోలు మతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.