సంస్కృతి మూలాలను తెలియజేయండి


Ens Balu
7
Rajamahendravaram
2022-08-19 11:48:51

భారతీయ సంప్రదాయం, సంస్కృతి మూలాలను పిల్లలకు తెలియజేసి పిల్లల్లో సేవాభా వాన్ని  పెంపొందించే బాధ్యత ప్రతి తల్లితండ్రుల పై ఉందని జిల్లా కలెక్టర్ డా కే. మాధ వీలత పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా కలెక్టర్, పార్లమెంట్ సభ్యులు కుటుంబ సభ్యుల సమేతంగా  ఇస్కాన్ దేవాలయానికి వొచ్చి  పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరికీ శ్రీ కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఇస్కాన్ సంస్థ వారు మన సంస్కృతి, సంప్రదాయాలను వ్యాప్తి చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో, ప్రకృతి విపత్తుల సమయంలో  ఇస్కాన్ సంస్థ వారు భాగస్వామ్యం అవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు. మన దేశ సంప్రదాయం, సంస్కృతి తో పాటు సేవా కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే మూడు కార్యక్రమాలు ఎంతో నిబద్దతతో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈరోజు ఇంత మంది చిన్నారులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం అన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లవాడిని ఏ స్కూల్ లో చేర్పించాలి? ఎలా చదివించాలి ? అనే కాకుండా సేవ భావం, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకూనేలా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. ఈపోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలెక్టర్ అభినందించారు. 

ఇస్కాన్ దేవాలయం లో జరిగిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ లు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీకృష్ణుడు మానవాళి అంతటకు మార్గదర్శకుడు, ఆదర్శ ప్రాయం అన్నారు. కళలకి కాణాచి అయిన రాజమహేంద్రవరం లో ఇస్కాన్ దేవాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తారన్నారు. పిల్లలందరూ కృష్ణా రాధల వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి అభినందనను తెలియచేశారు.