ప్రతివారం విధిగా" ఫ్రైడే - డ్రైడే" పాటించండి


Ens Balu
5
Visakhapatnam
2022-08-20 06:18:17

 మహా విశాఖ నగరంలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు  ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా, ప్రతివారం విధిగా "ఫ్రైడే – డ్రైడే"పాటించేలా విశాఖ నగర వాసులకు వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ ఆదేశించారు. శనివారం ఆయన 3వ జోన్, 24వ వార్డు, వినాయక నగర్ పరిసర ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను  ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తూ పర్యటించారు. ఈ పర్యటనలో కమిషనర్ ప్రతి ఇంటి ముందు నిలువ చేసుకున్న నీటి నిల్వలలో దోమల వృద్ధికి సంబంధించిన లార్వాలను గుర్తించి, వాటిని వెంటనే ఖాళీ చేయించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎన్నో ప్రచార, ప్రసార కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ప్రజలకు వాటిని తెలియపరచడంలో వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు విఫలమవుతుండడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి నిల్వలలో దోమలు వృద్ధి చేసే లార్వాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ, అందుకు తగిన అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అందించడం లేదని వార్డు  శానిటరీ కార్యదర్శి, వాలంటీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి దోమల వృద్ధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై అవగాహన కల్పిస్తున్నదీ, లేనిదీ పలు నివాసిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించడంపై విఫలమైనందుకు గాను ఆ వార్డు కార్యదర్శికి మెమోను జారీ చేయవలసినదిగా జోనల్ కమిషనర్ శివ ప్రసాద్ ను కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆరోగ్య రక్షణకు కావలసిన చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రజారోగ్య వ్యవస్థదేనని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జోనర్ కమిషనర్ ను కమిషనర్ ఆదేశించారు. అనంతరం దోమలు ఎక్కువగా వృద్ధి చెందే వస్తువులను ప్రదర్శించి, నినాదాలతో అవగాహనా ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడవ జోనల్ కమిషనర్ శివ ప్రసాద్, సహాయ వైద్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఏసిపి వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.