దోమల నివారణకు ప్రతీఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి కోరారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా, తమ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దోమలవల్ల కలుగుతున్న అనర్థాలను వివరించారు. దోమ అతిచిన్న కీటకమే అయినప్పటికీ, మానవాళికి దీనివల్ల ఎన్నో రకాల ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. దోమల కారణంగానే మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతోందని, 1897లో సర్ రోనాల్డ్ రాస్ ప్రకటించారని, అప్పటినుంచి దోమల నివారణా కార్యక్రమాలు మొదలయ్యాయని చెప్పారు. మలేరియా వ్యాధికి సకాలంలో సరైన వైద్యం చేయించకపోతే, మళ్లీమళ్లీ వచ్చి, చివరకు ప్రాణాంతకమవుతుందని తెలిపారు. అందువల్ల దోమలపట్ల నిర్లక్ష్యం చూపకూడదని, దోమకాటువల్ల వచ్చే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా మలేరియా అధికారి తులసి మాట్లాడుతూ, దోమవల్ల కలుగుతున్న అనర్ధాలను వివరించారు. దోమవల్ల కేవలం మలేరియా మాత్రమే కాకుండా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, ఫేలేరియా, మెదడు వాపు తదితర వ్యాధులు వస్తాయని తెలిపారు. వీటిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతరం తెలియజేస్తూ, ప్రజల్ని అప్రమత్తం చేస్తోందని చెప్పారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి కృషి చేయడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా దోమలను నివారించడానికి ప్రజల సహకారం చాలా అవసరమని ఆమె స్పష్టం చేశారు. ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా డ్రైడే నిర్వహించాలని, ఇంటిలోపల, ఇళ్ల చుట్టుప్రక్కలా నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. నీళ్ల కుండీలను, నీరు నిల్వ ఉంచే పాత్రలను నిరంతరం శుభ్రం చేయాలని చెప్పారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు అదుపులోనే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
జిల్లా సహాయ మలేరియా అధికారి డి.వెంకటరమణ మాట్లాడుతూ, వ్యాధులు విజృంభించకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.