రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని సహించబోమని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత హెచ్చరించారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగిన స్పందన వేదికలో ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం ద్వారా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచనలు జారీచేశారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన వేదిక అనంతరం అధికారులతో కమిషనర్ వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని కమిషనర్ స్పష్టం చేసారు. స్పెషల్ అధికారులంతా ప్రతీ వారం క్రమం తప్పకుండా తమకు కేటాయించిన సచివాలయాలను సందర్శించి, కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. స్పందన వేదిక సమయంలో కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందన వేదికలో ‘డయల్ యువర్ కమిషనర్’ ద్వారా 30, కార్యాలయం వేదికగా 29 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. స్పందన వేదికలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.