ఆ వీఏఏల సమాధానాలు నమ్మసక్యంగా లేవు


Ens Balu
7
Kakinada
2022-08-23 09:58:15

కాకినాడ జిల్లాలో ఈ-క్రాప్ నమోదులో భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడిన గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ఇచ్చిన సమాధానాలు నమ్మసక్యంగా లేవని అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా ఫోనులో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులకు అవకతవకలకు పాల్పడ్డారనే ప్రాధమిక సమాచారంపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఆయనే పేర్కొన్నారు. అందులో శంఖవరం మండలం వీఏఏలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తరువాత ఇచ్చిన సమాధానంతో రెవిన్యూ సిబ్బంది ఇచ్చిన సమాధానాలకు పొంతన కుదరడం లేదని ప్రస్తుతం జిల్లా వ్యప్తంగా విచారణ జరుగుతోందని ఆయన వివరించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనలో కూడా నోటీసులు ఇచ్చిన ప్రాంతాలను తాము కూడా పరిశీలిన చేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ-క్రాప్ నమోదు విషయంలో జరిగిన భారీ అవకతవకలపై చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లినట్టు జేడీఏ ఎన్.విజయ్ కుమార్ ఈఎన్ఎస్ కి వివరించారు.

నేటికీ షోకాజ్ నోటీసుల విషయం చెప్పని విఏఏలు
కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ అవకతవకలకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు నేటి వరకూ ఆ విషయాన్ని తాము పనిచేసే సచివాలయ డీడీఓలకు గానీ, మరికొందరు గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు గానీ తెలియజేయక పోవడం విశేషం. నోటీసులు అందుకున్న దగ్గర నుంచి చాలా మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులు సచివాలయాలకు కూడా హాజరు కాకుండా, అటు డీడీఓ  పంచాయతీ కార్యదర్శిలకు కూడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొన్నిచోట్ల గ్రేడ్-5 కార్యదర్శిలకు విషయం తెలిసినా..వారంతా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తుండటం విశేషం. అందునా తప్పుచేసింది వీఏఏలే అన్నట్టుగా..తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే మాట్లాడుతుండటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ శాఖలోని వ్యవసాయశాఖ వీఏఏలు దైర్యంగా ఈ-క్రాప్ బుకింగ్ విషయంలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడటం, అదే సమయంలో సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఈ భారీ స్కామ్ బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  ఇటు జిల్లా అధికారులు ఎంత మొత్తంలో అవినీతి జరిగిందనే విషయాన్ని, ఎంతెంత మొత్తాలకు వీఏఏలకు నోటీసులిచ్చారనే సమాచారాన్ని మీడియాకి తెలియజేస్తే తప్పా జిల్లా వ్యాప్తంగా ఎంతపెద్ద మొత్తంలో ఈ-క్రాప్ అవినీతి జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చూడాలి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ భారీస్కాములో కాకినాడ జిల్లాలో ఎంతమొత్తం వ్యవసాయశాఖ అధికారులు నిగ్గు తేల్చి.. ఎంతమందిని ఇంటికి పంపిస్తారనేది..!