కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వంద పడకలతో డెంగీ చికిత్సకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మెడికల్, సర్జికల్ బ్లాకులను కలెక్టరు కృతికా శుక్లా.. జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్ మెడికల్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో 100 పడకలతో డెంగీ వ్యాధికి చికిత్స పొందేవారి కోసం ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందు కొరకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. సీజనల్ వ్యాదులైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాదులు పట్ల వైద్యులు అప్రమత్తుతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో వార్డులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులు సూచించారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులపై అవగాహన పెంపొందించుకుని తమ నివాస, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా మెడికల్ బ్లాక్, వోల్డ్ ఎస్ఎస్ఆర్ వార్డులో డెంగీ వ్యాధితో చికిత్స పొందుతున్న వారితో కలెక్టర్ మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టరు వెంట జీజీహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్, మెడికల్ వార్డు విభాగాధిపతి డా. విజయ్ కుమార్, ఆర్.ఎం.ఓ డా.యమున ఇతర వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.