మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. నష ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా తన ఛాంబర్‌లో వివిధ విద్యాశాఖల అధికారులతో, కలెక్టర్ తన ఛాంబర్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువతను మత్తుపదార్ధాలనుంచి విముక్తి కల్గించాలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, వీటి వాడకం వల్ల కలిగే నష్టాలను, దుష్పరిణామాలను వివరించాలని సూచించారు. దీనిలో భాగంగా ప్రతీ విద్యాసంస్థలో ఫెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. మత్తుపదార్ధాలను వాడబోమంటూ, విద్యార్థులచేత ప్రతిజ్ఞలు చేయించాలని సూచించారు. మత్తుపదార్ధాల వినియోగం వల్ల జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో తెలియజేయాలని అన్నారు. అలాగే మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల కొనుగోలు, విక్రయాలు చేపట్టినా, వాటిని వినియోగించినా చట్టప్రకారం నేరమని, వాటికి పడే శిక్షల గురించి తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ కె.బాబులు, డిఇఓ కె.వెంకటేశ్వర్రావు, సమగ్ర శిక్ష పిఓ డాక్టర్ వి.స్వామినాయుడు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ఎడి జగదీష్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.