స్మార్ట్ సిటీ మిషన్ కింద కాకినాడలో చేపట్టిన 71 ప్రాజెక్టుల్లో 50 ఇప్పటికే పూర్తయ్యాయని.. మిగిలిన 21 ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో మూడో సిటీ లెవెల్ అడ్వయిజరీ ఫోరమ్ (సీఎల్ఏఎఫ్), 34వ డైరెక్టర్ల బోర్డు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివ ప్రసన్న, కమిషనర్ కె.రమేష్, అడ్వయిజరీ ఫోరమ్ సభ్యులు, డైరెక్టర్లు హాజరయ్యారు. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన ప్రాజెక్టులు, పూర్తయిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో పురోగతి తదితర వివరాలను కమిషనర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ మిషన్ పనుల ద్వారా కాకినాడ సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి సలహాలు తీసుకునేందుకు, మార్గనిర్దేశనం పొందేందుకు అడ్వయిజరీ ఫోరమ్ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫోరం సభ్యులు చేసిన సూచనలు ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి, నగర అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. రూ. 564 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, రూ. 348 కోట్ల అంచనాలతో చేపట్టి, ప్రస్తుతం పనులు జరుగుతున్న 21 ప్రాజెక్టులను పటిష్ట ప్రణాళికలతో, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో 2023, జూన్‌లోగా పూర్తిచేసి, వినియోగంలోకి తెచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. పూర్తయిన ప్రాజెక్టుల సమర్థ నిర్వహణపైనా అధికారులు దృష్టిసారించాలన్నారు. మిషన్ పూర్తికి ఇంకా పది నెలల సమయం అందుబాటులో ఉన్నందున.. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని చేపట్టిన అన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఉప కమిటీల సమావేశాలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్.. అధికారులకు సూచించారు. సమావేశాల్లో ఫోరం సభ్యులు వైడీ రామారావు, డా. వై. కళ్యాణ్‌చక్రవర్తి, టీవీఎస్ కృష్ణకుమార్, జేవీఆర్ మూర్తి, సీహెచ్ సుసి తదితరులు హాజరయ్యారు.