పర్యావరణ హితంగా గణపతి నవరాత్రులు


Ens Balu
5
Kakinada
2022-08-24 14:02:24

గణపతి నవరాత్రి ఉత్సవాలను పర్యావరణం, పౌర జీవనాలకు విఘాతం కలుగకుండా,  సజావుగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాద్ బాబు సంయుక్తంగా వివిధ శాఖల జిల్లా అధికారులు, నగర గణేశ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి గణపతి నవరాత్రి ఉత్సవాలు, విగ్రహ నిమజ్జనాల నిర్వహణ అంశాలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఏటా ప్రజలు భక్తిశ్రద్దలతో ఆనందగా జరుపుకునే వినాయక చవితి వేడుకలు  కోవిడ్ మహమ్మారి కారణంగా 2019 తరువాత గడచిన రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయని, కోవిడ్ పరిస్థితులు దాదాపు తొలగిన నేపద్యంలో ఈ సంవత్సరం వేడుకలను తిరిగి జరుపుకోవడం జరుగుతోందన్నారు.  ఈ వేడుకలను కృత్రిమ రసాయనిక రంగులు వాడని, మట్టితో చేసిన విగ్రహాలను పూజించి  పర్యావరణ హితమైన రీతిలో జరుపుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  అలాగే ఉత్సవ నిర్వహణకు ఏర్పాటు చేసే పాండళ్లను జన, వాహన సంచారాలకు ఆటంకం కలిగించని రీతిలో ఏర్పాటు చేసుకోవాలని, పందిళ్లలో ఎటువంటి ప్రమాదాలకు తావులేని రీతిలో తగిన భద్రతా ఏర్పాట్లు తప్పని సరిగా పాటించాలని కోరారు.  

పాండళ్ల ఏర్పాటు చేసేటపుడు రెవెన్యూ, విద్యుత్, పోలీస్, మున్సిపల్, పంచాయితీ శాఖల అనుమతి విధిగా తీసుకోవాలని తెలిపారు.  పందిళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే మైకులను అనుమతించిన సమయాల్లోనే వినియోగించాలని, శబ్ద కాలుష్యం వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగకుండా వేడుకల నిర్వాహకులు సహకరించాని కోరారు.  అలాగే బాణాసంచా వినియోగించేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.    నవరాత్రి వేడుకల అనంతరం విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు అనువైన, భద్రమైన ప్రదేశాలను ఆర్డిఓలు, మున్సిపల్ కమీషనర్లు గుర్తించి, అవసరమైన క్రేన్లు, లైటింగ్ ఇతర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.  అలాగే ఊరేగింపులు సాగే మార్గాల్లోను, నిమజ్జన ప్రదేశాలలోను సిసి కెమెరాలను ఏర్పాటు చేసి అవాంఛిత సంఘటనలు జరుగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.  నిమజ్జనం రోజున జిల్లాలో మద్యం షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.   అలాగే పోలీస్ శాఖ సమన్వయంతో ఊరేగింపు రూట్లు నిర్థేశించి, ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా నివారించాలని ఆదేశించారు.  నిమజ్జన ప్రదేశాల వద్ద ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను, బోట్లను ఏర్పాటు చేయాలని మత్య్స శాఖను ఆదేశించారు.  

అలాగే ఈ ప్రదేశాల వద్ద లైటింగ్ ఏర్పాటుకు మున్సిపల్, పంచాయితీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఫస్ట్ ఎయిడ్ క్రేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.  నిమజ్జనాలు నిర్వహించే జల వనరులలో నిమజ్జనాలకు ముందు, తరువాత కాలుష్య స్థాయిలను నమోదు చేయాలని, 48 గంటలలోపు విగ్రహాల కొరకు వాడిన ఇనుము, ప్లాస్టిక్ సామాగ్రిని పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.  అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలలో అన్ని జాగ్రత్తలతో వేడుకలు జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో వేడుకలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని కోరారు. 
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ యం.రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ కోవిడ్ ముప్పు ముగిసిన అనంతరం ఈ యేడాది  గణపతి నవరాత్రి వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారని, ఈ వేడుకలను ఎవరికీ ఇబ్బంది లేకుండా, సురక్షితంగా జరుపుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  పాండళ్ల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనాలు సందర్భంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ నియంత్రణ చేపడుతుందన్నారు.  ప్రతి పాండళ్ వద్ద నిర్వాహకులు ఫైర్ ఫైటింగ్ జాగ్రత్తలు, పరికరాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  లైటింగ్, కరెంట్ వైర్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగకుండా ట్రాన్స్ కో అధికారుల పరిశీలన అవసరమన్నారు. నిమజ్జన స్థలాల వద్దకు చిన్న పిల్లలను అనుతించ వద్దని ఉత్సవ కమిటీలను కోరారు. 
సమావేశంలో నగర గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధుల బృందం సభ్యులు దూసర్లపూడి రమణరాజు, దువ్వూరి సుబ్రమణ్యం, రంభాల వెంకటేశ్వర్లు, యెనిమిరెడ్డి మాలకొండయ్య గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగానికి అన్ని విధాల సహకరిస్తామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె.శ్రీధరరెడ్డి, ఆర్డిఓలు బి.వి.రమణ, జె.సీతారామారావు, డిపిఓ ఎస్.వి.నాగేశ్వరనాయక్, డిఎస్పిలు భీమారావు, మురళీమోహన్, అంబికాప్రసాద్, జిల్లా మత్స్య అధికారి పి.వి.సత్యన్నారాయణ, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయితీరాజ్, ట్రాన్స్ కో, పొల్యూషన్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.