అన్ని దానాల్లో కన్నా నేత్ర దానం గొప్పదని.. ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో నేత్ర దానానికి ముందుకు రావాలని.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పిలుపునిచ్చారు. నేత్ర దానం తాలూక ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నేత్రదాన పక్షోత్సవాలను ఆమె గురువారం జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా కలెక్టర్ సూర్యకుమారి తన నేత్రాలను దానం చేస్తూ సంబంధిత అంగీకార వీలునామా పత్రాన్ని వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేత్ర దాన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని.. కళ్లు లేనివారి జీవితాల్లో వెలుగులు నింపాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై అపోహలు వీడి మానవతా దృక్పథంతో అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన తర్వాత కళ్లు ఇవ్వటం ద్వారా మరో ఇద్దరికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చని అభిప్రాయపడ్డారు.
నేత్ర దాన ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు పెట్టనున్నామని పేర్కొన్నారు. పక్షోత్సవాలు వచ్చే నెల 8వ తారీఖు వరకు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం వైద్యారోగ్య శాఖ సిబ్బంది, కంటి వెలుగు విభాగ వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సారథి వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు కలెక్టరేట్ నుంచి పెద్దాసుపత్రి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. బి. శివప్రసాద్, కంటి వెలుగు విభాగ అధికారి డా. తారకేశ్వరరావు, ఇతర వైద్యాధికారులు, పుష్పగిరి ఆసుపత్రి వైద్య సిబ్బంది, సారథి వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.