మహా విశాఖ నగర ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల డబ్బుతో పార్లే సంస్థకు ప్రచారం చేయడం సిగ్గుచేటని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. బీచ్ క్లీన్ బాధ్యతలు పార్లే సంస్థకు అప్పగించడానికి ఒప్పందం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెచ్చించి బీచ్ క్లీన్ చేసి ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. బీచ్ లోని ఆక్రమణలు తొలిగించాలని కోరుతూ గురువారం జీవీఎంసీ మేయర్, కమిషనర్ కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ బీచ్ క్లీన్ మెగా డ్రైవ్ పేరుతో విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్ లో చెత్తను వ్యర్ధాలను తొలగించెందుకు 25 వేల మందితో భారీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమే కానీ, దాని కంటే ముందు అసలు బీచ్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ తీరంలో పెద్ద ఎత్తున కోస్తా నియంత్రణ మండలి ( సీ ఆర్ జడ్ ) ఉల్లంఘనలు జరిగాయన్నారు. గతంలో సీఆర్జెడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారన్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అప్పట్లో కూల్చివేసిన వన్నీ తిరిగి వెలిశాయని చెప్పారు. వాటికి అనుబంధం గా కొత్త కొత్తవి వచ్చి చేరాయి. గతంలో ఏ ప్రభుత్వం లోనూ ఎన్నడూ లేని విధంగా సముద్రంలోకి ఇసుకతిన్నెలపై కి వెళ్లి కాంక్రీట్ తో పెన్షింగ్ లు వేస్తున్నారన్నారు. రెవెన్యూ, వుడా,మున్సిపల్ అధికారులు పరోక్షంగా ఈ కబ్జాదారులకు సహకరిస్తున్నారన్నారని ఆరోపించారు. అసలు బీచ్ లో వ్యరథాలు అనేవి ఉంటే వాటిని శుభ్రం చేయవచ్చు. అదే కబ్జాకు గురైతే చేయటానికి ఏమీ ఉండదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టే ముందు బీచ్ ఆక్రమణలపై దృష్టిసారించాలన్నారు. వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు.
విశాఖ నగరం లో భాగమైన జోడుగుళ్ల పాలెం, సాగర్ నగర్, రాడిసన్ హోటల్ ప్రాంతం, రిషి కొండ ప్రాంతం, కాపులుప్పాడ భీమిలి తీరాల్లో పెద్ద ఎత్తున కబ్జాలకు ఆక్రమణలకు గురైందని తెలిపారు. కోస్తా నియంత్రణ మండలి ఉల్లంఘనల భారీగా జరిగాయయని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా కేవలం ప్రచారం కోసం అవార్డు ల కోసం ఉత్తుత్తి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చివరికి అపహాస్యంగా మిగిలిపోతుందన్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల కబ్జాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. బీచ్ ను కాంక్రీట్ జంగిల్ గా మార్చడం హోటళ్లు షాపులు వంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల అవి సాంఘిక కార్యక్రమాలకు, నైట్ పార్టీ లకు, గంజాయి సరఫరా కు వేదికలుగా మారుతున్నాయన్నారు. వీటిని తొలగించి గతంలో మాదిరిగా తీర రక్షణ కోసం షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీచ్ లో అక్రమ నిర్మాణాల వల్ల జీవీఎంసీ ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోందన్నారు.
ప్రైవేట్ సంస్థ కోసం జిల్లా లోని ఐఏఎస్ లు, మంత్రులు వారం రోజులుగా పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రైవేటు సంస్థ ప్రచారం కోసం పని చేయడం మాని ప్రభుత్వ విధులు నిర్వర్తించాల్సిన గా విజ్ఞప్తి చేశారు. పార్లే సంస్థకు ఇప్పటివరకు విశాఖలో ఎక్కడ రీసైక్లింగ్ యూనిట్లు లేవు. రేపు బీచ్ లోని 40 పాయింట్ల్లో సేకరించే చెత్త ను తిరిగి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్నారు. దీని వల్ల ఇంత పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం ఫలితాలు కనిపించవన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ధనం కోట్ల రూపాయల ను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్నారన్నారు. వీటిపై దృష్టి సారించి జరిగిన లోపాలను సరిదిద్దాల్సినదిగా విజ్ఞప్తి చేశారు.