అనకాపల్లి జిల్లాలో 268 మంది చేనేత పని వారికి నాలుగవ విడత "నేతన్న నేస్తం" పథకంలో రూ.24 లక్షల 32 వేలు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు వైయస్సార్ జగనన్న నేస్తం చెక్కును అందజేశారు. నాలుగు సంవత్సరాలుగా ఈ పథకంలో 1174 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల 81 లక్షల 76 వేలు ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 50 సంవత్సరాలు నిండిన 2747 మంది చేనేత కార్మికులకు చేనేత మరియు జౌళి శాఖ ద్వారా నెలకు రూ. 2,500/- చొప్పున మొత్తం రూ.68 లక్షల 67 వేల 500 అందిస్తున్నారన్నారు. 'ముద్ర' పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 29 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల 50 వేలు 20 శాతం మార్జిన్ మనీ గా అందజేసినట్లు చెప్పారు.
అంతకుముందు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం తోటమూల గ్రామంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న నేతన్న నేస్తం బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని చేనేత కార్మికులు నాయకులతో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. పి. వెంకటరమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీసెట్టి వరాహ సత్యవతి, అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కన్వీనర్ రామ లక్ష్మణ రావు ఏపీ వీవర్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. రాజారావు, సంఘాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.