ప్రతి శాఖ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఖజానాలో నమోదు కావాలని, టాన్ (టి.ఏ.ఎన్) నంబర్లు విధిగా పొందాలని జిల్లా ఖజానా, గణాంక శాఖ అధికారి కవిటి మోహన రావు అన్నారు. సి.ఎఫ్.ఎం.ఎస్, పే రోల్, ఖజానా ప్రక్రియ ద్వారా జరుగుతున్న చెల్లింపులపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారుల(డిడిఓలు)తో జిల్లా ఖాజానా కార్యాలయంలో గురు వారం సమావేశం నిర్వహించారు. 2018 సంవత్సరంలో సి.ఎఫ్.ఎం.ఎస్ విధానం అమలు ప్రారంభం అయిందన్నారు. ఈ విధానం మరింత సమర్ధవంతంగా అమలు చేయుటకు, వేగంగా చెల్లింపులు చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇందుకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సిపిఎస్ ఉద్యోగులు తమ వివరాలను ప్రతి మార్చి 31 నాటికి పరిశీలించుకోవాలని ఆయన చెప్పారు. వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే స్పందించి పరిష్కారం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఖజానా శాఖకు తెలియజేయాలని కోరారు. నాలుగవ తరగతి ఉద్యోగుల జి.పి.ఎఫ్ వివరాలు నమోదును పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి తన వ్యక్తిగత మొబైల్ ను అనుసంధానం చేసుకోవాలని ఆయన కోరారు.
పింఛనర్ల వివరాలు అందించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో పింఛనర్లు మృతి చెందినా వివరాలు అందించటం లేదని ఆయన చెప్పారు. జీతాల బిల్లులతో కలిపి ఇతర బిల్లులు సమర్పించరాదని ఆయన అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న ఉద్యోగులు ప్రతి నెల జీతం నుండి కొంత మొత్తాన్ని చెల్లింపు చేయడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు. పలువురు డి.డి.ఓలు మాట్లాడుతూ సి.ఎఫ్.ఎం.ఎస్, పే రోల్ కాకుండా అన్ని రకాల బిల్లులు ఒకే విధానంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు ఏ.మన్మథ రావు, కె.శ్రీనివాస రావు, సబ్ ట్రెజరీ అధికారి పి.ప్రసాద్, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డిడిఓలు), పింఛనర్లు తదితరులు పాల్గొన్నారు.