స్పందన వినతులు పరిష్కారంపై ఆగస్టు 30, సెప్టెంబరు 1వ తేదీన రెండు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారంపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో గ్రామ, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శిక్షణా తరగతులు నిర్వహించాలని అన్నారు. శాఖల వారీగా ఎక్కువగా వచ్చే వినతులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. వాటిని పక్కాగా, నాణ్యతతో పరిష్కారానికి సమగ్రమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన చెప్పారు. శిక్షణ అనంతరం స్పందన వినతులు పరిష్కారంలో సంతృప్తికర వాతావరణం రావాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపి సంతృప్తి చెందాలని ఉద్బోధించారు. ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో శాఖలు చేపడుతున్న చర్యలను గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుండి స్వయంగా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది నుండి అందరికీ స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.