సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన కాకినాడ 9వ డివిజన్ గొడారిగుంట సీతారామనగర్‌తోపాటు సాంబమూర్తినగర్ ప్రాంతాల్లో ఎంహెచ్‌వో డాక్టర్ ఫృద్వీచరణ్‌తో కలిసి పర్యటించారు. అక్కడక్కడ డెంగీ కేసులు నమోదు అవుతున్న నేపద్యంలో ఆయా ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, దోమలు వృద్ధి చెందకుండా తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమీక్షించారు. స్వయంగా దోమల నియంత్రణ కోసం చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దోమల నియంత్రణ, కు నగరపాలక సంస్థ ద్వారా తీసుకునే చర్యలకు తోడు ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన నీటిలో డెంగీ కారక దోమ వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగించి పక్కన పెట్టిన కొబ్బరి బొండాలు, టైర్లు, పూలకుండీలు వంటిచోట్ల వర్షపునీరు నిలిచి ఉంటే అక్కడ డెంగీ కారక దోమ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు అటువంటి నీటిని తొలగించడంతోపాటు స్వచ్ఛమైన నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఏఏ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఉందో సంబంధిత ఎఎన్‌ఎంలు, మెడికల్ ఉద్యోగులు ద్వారాను, యాప్‌లు ద్వారా గుర్తిస్తున్నామన్నారు. వెంటనే గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు.