ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు నేడు తొలి అడుగు పడబోతోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, పార్లే స్వచ్ఛంద సంస్థ అంకురార్పణ చేయబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సుమారు 25 వేల మంది వాలంటీర్లు స్థానిక హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న 28 కిలోమీటర్ల నిడివి గల తీర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ని సేకరించి పార్లే సంస్థకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో శుక్రవారం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమాలు జరిగే ఏ.యూ కన్వెన్షన్ సెంటర్, ఏ.యూ కాన్ఓకేషన్ హాల్ లోని ఏర్పాట్లను మంత్రులు అమర్ నాథ్ , ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురామ్ తదితరులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ, బీచ్ ప్లాస్టిక్ వలన జలచరాలు చనిపోతున్నాయని, అంతే కాకుండా పర్యావరణనికి హాని కలుగుతోoదని అన్నారు. 974 కి.మీ. తీర ప్రాంతoతో పాటు రాష్ట్రంలోని నదులలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించే ప్రక్రియ చేపడతామని మంత్రి అమర్ నాథ్ తెలియజేశారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ ను పార్లే సంస్థకు అప్పగిస్తామని, ఆ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి అదిదాస్ సంస్థ ద్వారా పాదరక్షల తయారీకి వినియోగం ఇస్తారని అమర్ నాథ్ వివరించారు.
పార్లే సంస్థ అనేక దేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని అన్నారు. అయితే శుక్రవారం విశాఖ లో సేకరించే ప్లాస్టిక్ ప్రపంచ రికార్డును సృష్టించ బోతోoదని ఆయన చెప్పారు. ఇక పార్లే సంస్థ ప్లాస్టిక్ రీసైకిల్ కి 25 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయమని కోరిందని, విశాఖ, అనకాపల్లిలో భూములు చూపించామనీ, వారు ఎంచుకున్న చోట స్థలాన్ని కేటాయిస్తామని అమర్ నాథ్ చెప్పారు. ఇదిలా వుండగా మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1,62,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనున్నారని, ఇప్పటివరకు 36000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, వారికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సర్టిఫికెట్లు అందచేయనున్నారని అమర్ నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ లక్ష్మిస,ఎమ్మెల్సీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.