రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశం విధిగా జరగాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు అన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. నెలలో మొదటి శుక్ర వారం ఆర్.బి.కె స్థాయిలో, రెండవ శుక్ర వారం మండల స్థాయిలో జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ కు బిందు సేద్యం అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ పంట మార్పిడి విధానంపై రైతులను చైతన్య పరచాలని చెప్పారు. వన్ ధన్ కేంద్రాల ద్వారా పంటలకు కొంత సహాయ సహకారాలు అందించుటకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ ఏడాది ధాన్యం సేకరణలో సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఎరువుల విక్రయంలో అవకతవలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఏనుగుల వలన కలుగుతున్న పంట నష్టానికి తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిలో సలహా మండలి సమావేశం పక్కాగా జరగాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో అన్ని గ్రామాలకు సబ్సిడీ ఒకే విధంగా ఉండాలని ఆమె కోరారు. ధాన్యం సేకరణలో సమస్యలు లేకుండా చూడాలని ఆమె అన్నారు. రైతులకు సెరీకల్చర్ దిశగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇ పంట నమోదు 56 వేల ఎకరాలలో జరిగిందన్నారు. సెప్టెంబరు 10 వరకు నమోదుకు గడువు ఉందని చెప్పారు. రోజుకు 50 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 2,31,324 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి, 99,905 ఎకరాల ఉద్యాన పంటల భూమి వెరసి 3,31,226 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,87,784 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ లో 22,759 క్వింటాళ్ల వరి, 1902 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. 48,700 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయుట లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 36,915 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఎరువులు అక్రమంగా విక్రయించే వారిపైన, ఎక్కువ ధరలకు విక్రయించే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అక్రమాలపై వచ్చే పిర్యాధులపై విచారణ చేస్తామని ఆయన చెప్పారు. కిసాన్ డ్రోన్లను మండలానికి మూడు చొప్పున మంజూరు అయ్యాయని, ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు పైలట్ శిక్షణకు దరఖాస్తు చేయవచ్చని ఆయన వివరించారు.
సలహా మండలి సభ్యులు పారి నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏనుగుల వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని, వాటి వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర సభ్యులు మాట్లాడుతూ పాలకొండలో గతంలో సొసైటీకి వెళ్లి ఎరువులు తీసుకునే వారమని, అదే విధానం కొనసాగితే మంచిదని కోరారు. ఈ సలహా మండలి సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య, ఇపిడిసిఎల్ డిఇ కె. వెంకట రత్నం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి. నాయక్, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.