కొండ శిఖర , మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు మండలం నందా - పగులుచిన్నూరు రోడ్ నుంచి చోర గ్రామం మీదుగా కొదమ వరకు అర్.సి.పి.ఎల్.డబ్ల్యు.ఇ నిధులు అంచనా వ్యయం రూ.11.36 కోట్లతో సుమారు 10.8 కిలోమీటర్ల మేర బిటి రోడ్ నిర్మాణానికి జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమక్షంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర శుక్ర వారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైదానం ప్రాంతం వలే కొండ శిఖర, మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారులు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గిరిజనులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు ఎక్కడా జాప్యం లేకుండా చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. యువకులు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కొండ ప్రాంతంలో గ్రామ సచివాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు.
కొన్ని రహదారి పనులు ఫారెస్ట్ అనుమతుల కోసం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే వాటిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన గిరిజనులకు అటవిహక్కు భూపట్టాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. వైద్యం, విద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తుద్ధితో పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గ్రామానికి రహదారులు కల్పించాలన్న ఎన్నో దశాబ్దాల గిరిజనుల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం ఆకాక్షిస్తుందన్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడాలని తద్వారా అభివృద్ధి కానవస్తుంది చెప్పారు. జిల్లా పరిషత్ నుండి తాగు నీరు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పనకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలకు అండగా ఉండే ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన చెప్పారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మాట్లాడుతూ కొదమ రహదారికి అనుసంధానం చేస్తూ 22 గ్రామాలకు రహదారులు నిర్మించుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. తద్వారా రెండు వేల జనాభాకు చక్కని రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రూ.180 కోట్లతో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. రహదారుల నిర్మాణం వలన సామాజిక, ఆర్థిక అభివృద్ధి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి పద్మావతి, మక్కువ జెడ్ పిటిసి డి. శ్రీనివాస రావు, కొదమ ఎంపిటిసి, సర్పంచ్ లు కూనేటి గిందే, తాడంగి సుసుమ, పంచాయితి రాజ్ ఈ ఈ డా,ఎమ్.వి.జె. కృష్ణాజి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ఓ.ప్రభాకర రావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్ర రావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతిశ్వర రావు, తాసిల్దార్ రామ స్వామి, ఎమ్ పి డి ఓ పి.పార్వతీ, తదితరులు పాల్గొన్నారు.