ప్రణాళికా బద్ధంగా ఈ-క్రాప్ నమోదు జరగాలి


Ens Balu
7
Vizianagaram
2022-08-26 13:37:26

ప్రభుత్వ విధి విధానాలను అనుగుణంగా ఈ క్రాప్  నమోదు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన భూములను నమోదు చేయకూడదని అన్నారు.   ఈ విషయం పై తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిగించాలన్నారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ  వెబ్ ల్యాండ్ లో ఉన్న భూమికి ముందుగా ఈ క్రాప్ నమోదు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకానికి అనుసంధానం చేయనున్న దృష్ట్యా సెప్టెంబర్ లోగా ఈ క్రాప్ నమోదు, ఈ.కె.వై.సి లను పూర్తి చేయాలన్నారు.  ఎరువులకు సంబంధించి డి.ఏ.పి సరఫరా తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని,  రైతుకు తగు సలహాలను   అందిస్తూ సహకరించాలని జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు కు  సూచించారు.  వరి, మొక్క జొన్న పంటల స్థానంలో అరటి సాగు పై అవగాహన పెంచి రైతులకు ప్రోత్సహించాలని చైర్మన్ సూచించారు. అరటి సాగు కోసం   సాయిల్ టెస్ట్ చేసి, భూగర్భ నీటిని పరీక్షించి మండలం వారీగా డాటా సిద్ధం చేయాలన్నారు. 

 జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడుతూ అదనపు ఎరువుల కోసం డి.ఓ లేఖ రాయాలని మార్కుఫెడ్ డి.ఎం కు సూచించారు. ఎరువుల లభ్యత, ఈ క్రాప్ నమోదు నిబంధనలు ఆర్.బి.కె వరకూ చేరాలని , జిల్లా స్థాయి నుండి వ్యవసాయాధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఎరువులు, సి.హెచ్.సి రుణాల పై ఆడిట్ జరగాలని సూచించారు. ఈ సమావేశం జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగింది సమావేశంలో ఎం.ఎల్.సి రఘురాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, జె.సి మయూర్ అశోక్, డి.సి.ఎం.ఎస్ చైర్పర్సన్ డా.భావన, కమిటీ  సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

11వ వ్యవసాయ గణన కు జిల్లా కమిటీ ఏర్పాటు..
వ్యవసాయం లో వస్తున్న మార్పులను,  భూ కమతాల వివరాలను, విస్తీర్ణం, పంటల సాగు, మహిళా రైతులు, కౌలు రైతులు, పంటల విధానం, రైతులు వాడే ఎరువులు, విత్తనాలు,  రుణాల పద్ధతి తదితర  వివరాలను వ్యవసాయ గణన లో భాగంగా  సేకరించడం జరుగుతుందని సి.పి.ఓ బాలాజీ వివరించారు.  ఇందుకోసం జిల్లా స్థాయి  కమిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీ లో వ్యవసాయ, అనుబంధ శాఖలు, రెవిన్యూ శాఖల అధికారులు సభ్యులుగా  ఉన్నారని తెలిపారు. త్వరలో వ్యవసాయ   గణన కార్యక్రమం జరుగుతుందన్నారు.