గ్రామస్ధాయిలో వ్యవసాయ సమస్యలు పరిష్కరించడం కోసమే వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యమని జాయింట్ కలెక్టర్ ల్పనా కుమారి అన్నారు. అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాస్ధాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ, గ్రామస్ధాయిలో రైతు భరోసా కేంద్రాల వివిధ సేవలు గ్రామస్ధాయిలోనే అందించడం జరుగుతుందన్నారు. ఈ-క్రాప్ నమోదును త్వరగ పూర్తిచేయాలన్నారు. పంట విక్రయంలో ఈ-క్రాప్ నమోదు ఎంతో కీలకమో ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ మొక్కలకు సంబంధించి క్వారంటైన్ సర్టిఫికేషన్ అయిన పిదప మొక్కలు పంపిణీ జరుగుతుందన్నారు. అవసరమైన రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రంలో నిర్ధిష్ట ధరఖాస్తు, ఇతర డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఏమైనా సమాచారం అవసరమైతే ఉధ్యానశాఖ అధికారి లేదా రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. మైక్రో ఇరిగేషన్స్ మంజూరుకు సంబంధించి అవసరమైన ప్రక్రియ జరుగుతున్నదన్నారు.
రిజిస్ట్రేషన్ చేయించుకొనే రైతులు తమ పొలాలను సర్వేచేయించుకొని వాటికి చెల్లించవలసిన రైతు వాటా చెల్లించినట్లయితే మంజూరు చేసి ఆయా కంపెనీలు ద్వారా ఇన్సులేషన్ చేయించడం జరుగుతుందన్నారు. 1962 ఎమర్జెన్సీ వాహనం ద్వార పశువులకి అత్యవసర పరిస్థితిలో చికిత్స చేయడం జరుగుతుం దని , దీని గురించి రైతులకి అవగాహన కల్పించాలని ఆమె పశుసంవర్ధక అధికారిని ఆదేశించారు. ఈ- క్రాప్ బుకింగ్ పర్యవేక్షణ జాగ్రత్తగా చేయాలి. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ, మండలస్ధాయిలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో వచ్చిన అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ అధికారి లీలావతి, ,పశుసంవర్ధక అధికారి ప్రసాద్‌రావు, మత్స్యశాఖ లక్ష్మణరావు , పౌర సరఫరాల సంస్ధ డియం కె శ్రీలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.