పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 1.18 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోపు సేకరించాలని జాయింట్ కలెక్టర్ జెవి.మురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ సంబంధించిన అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జెసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2021-22 రబీలో సేకరించిన ధాన్యం నుంచి పౌరసరఫరాల సంస్థ 3.06 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్టు పేర్కొన్నారు. అలా ఎఫ్ సి ఐ 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాల్సి ఉండగా 32 వేల టన్నులు మాత్రమే సేకరించారు. మిగిలిన బియ్యాన్ని గడువులోగా సేకరించాలన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ డివిజనల్ మేనేజర్ కులదీప్ సింగ్ ,జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ టి .శివరామ ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని ఎన్ .సరోజ, సహాయ మేనేజర్ గణనాథ, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జయరాజు, కోశాధికారి కొత్త వెంకట శ్రీమన్నారాయణ, ఆకివీడు మండల అధ్యక్షులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.