కార్పొరేట్ కు ధీటుగా ఎస్సీ గురుకులాలు


Ens Balu
3
Madhurawada
2022-08-26 14:35:13

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రి నాగార్జున మేఘాద్రిగడ్డ లోని బి. ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ గురుకులాలు, హాస్టళ్ల రూపురేఖలు మార్చే విధంగా వాటిని నాడు- నేడు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేర్చారని, ఒక్క సంతకంతో ఎస్సీ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాటలు వేశారని కితాబిచ్చారు. పిల్లలకు మంచి పోషకాహారం తో పాటు వారికి కావాల్సిన సకల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా సమాజంలో వారు ఉన్నత స్థానాలకు చేరుకునే మార్గాన్ని నిర్మించారని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్పారు. 

 ఎస్సీ గురుకులాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడం లో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నామని నాగార్జున వెల్లడించారు. పిల్లలకు వివిధ సబ్జెక్టులు బోధించే టీచర్లు తమ సబ్జెక్టుల్లో పిల్లలు 100% ఫలితాలు సాధించేలా చూసుకోవాలని, ఆ బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేశారు. పిల్లలు వెనుకబడిన సబ్జెక్టుల్లో వారికి ట్యూషన్లు చెప్పించాలని ఆదేశించారు. 100% ఫలితాల సాధన కోసం ఎస్సీ గురుకులాల్లో బోధనా పద్ధతులను కూడా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి కూడా పాల్గొన్నారు.