డిగ్రీ విద్యార్థులకు 2 నెలలు నైపుణ్య శిక్షణ


Ens Balu
6
Kakinada
2022-08-26 16:17:56

డిగ్రీ విద్యార్థుల ఉద్యోగ నైపుణ్య శిక్షణకు సంబంధించి కాకినాడ జిల్లాలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న11,622 మంది విద్యార్థులను ఈ నెల 31 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తిచేయాల‌ని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో విద్యార్థుల ఇంట‌ర్న్‌షిప్‌, అప్రెంటీస్‌షిప్‌పై కలెక్టరు డా. కృతికా శుక్లా.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, పరిశ్రమలు, వికాస సంస్థ ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఇంట‌ర్న్‌షిప్‌, అప్రెంటీస్‌షిప్‌ల ద్వారా జిల్లాలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు రెండు నెలలు పాటు అనుసంధానం చేసిన శాఖల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రెండు నెలలు ఇంట‌ర్న్‌షిప్ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టరు అధికారులకు సూచించారు. సమావేశంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ టి.అశోక్, డీన్ పి.సురేష్ వర్మ, రిజిస్ట్రార్ టి.అశోక్, పరిశ్రమల శాఖ ఏడీ కె.కృష్ణార్జునరావు, ఏపీఐఐసీ జెడ్.ఎం.లక్ష్మి ఆండాళ్, వికాస పీడీ కె.లచ్చారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.