కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కెఎస్ఈజెడ్) భూములకు సంబంధించి రెవెన్యూ, సర్వే; రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు వేగంగా భూములు అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా.. ఎస్ఈజెడ్, రెవెన్యూ; రోడ్లు, భవనాలు; ఇరిగేషన్, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో కెఎస్ఈజెడ్ భూముల సర్వే, రిజిస్ట్రేషన్, అన్నవరం నుంచి కోనా రైల్వే లైన్ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఎస్ఈజెడ్ భూములకు సంబంధించి ఏవీ నగరం, కె.పెనుమల్లపురం, కోదాడ గ్రామాలలో 360 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 194 ఎకరాల భూమి సర్వే, రిజిస్ట్రేషన్ పనులను పూర్తిచేసి రైతులకు అప్పగించడం జరిగిందన్నారు. అదేవిధంగా తొండంగి, యూ.కొత్తపల్లి మండలాలకు సంబంధించి భూముల సర్వే, రిజిస్ట్రేషన్ పనులను వేగవంతం చేసి, రైతులకు భూమిని అప్పగించే విధంగా చూడాలన్నారు.
ఇందుకు కెఎస్ఈజెడ్, రెవెన్యూ, సర్వే, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో కెఎస్ఈజెడ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించినందున వారం వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. సమావేశంలో కెఎస్ఈజెడ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ రమణ, జె.సీతారామారావు; రోడ్లు, భవనాలు; ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, అరబిందో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సీఆర్ఎం నాయుడు, ప్రతినిధులు వి.దుర్గాప్రసాద్, పీవీఎస్ రాజు, జె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.