విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని అందుకే వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్లు వెచ్చిస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యానికి.. సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగంలో మరింత ప్రగతి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని కొత్తపేట కుమ్మరవీధి 14వ వార్డులో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు గదులను, రూ.98 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘురాజు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, వార్డు కార్పొరేటర్ రాజేష్‌లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా నాడు-నేడు నిధులు, కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన కుమ్మరవీధిలోని స్వామి వివేకానంద ప్రాథమిక పాఠశాల గదులను పరిశీలించారు. ఆధునిక వసతులతో కూడిన ఇంగ్లీషు, కంప్యూటర్ ల్యాబ్‌లను చూసిన మంత్రి మంత్ర ముగ్ధులయ్యారు. పాఠశాలలో అన్ని గదులకు ఏసీ పెట్టించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాల రాష్ట్రంలోనే తలమానికమైనదని కితాబిచ్చారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. పుస్తకంలోని అక్షరాలను, బొమ్మలను చూపించి ఇవేంటి అని చిన్నారిని అడిగారు.
వైద్య సేవలు నిత్యం అందేలా చర్యలు
అనంతరం రూ.98 లక్షలతో నిర్మించిన ఆధునిక వసతులతో కూడిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సంకల్పంతో ముందుకెళ్తోందని దానిలో భాగంగానే ఈ రోజు నాడు - నేడు ద్వారా వేల కోట్లు ఖర్చు చేస్తూ విద్య, వైద్య రంగంలో ఎన్నో సదుపాయాలను కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిజమైన పాలనకు నిదర్శనమే ఈ పట్టణ ఆరోగ్య కేంద్రమని పేర్కొన్నారు. పట్టణంలో మొత్తం ఏడు కేంద్రాలను ప్రభుత్వం ప్రకటించిందని వాటిలో ప్రథమంగా కుమ్మరవీధిలోని ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వచ్చిందని, మరో నాలుగు 75 శాతం పనులను పూర్తి చేసుకున్నాయని వివరించారు. మిగిలిన కేంద్రాలు కూడా పట్టణవాసులకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యులను, సిబ్బందిని నియమించామని, ఇక్కడి నుంచే 104 వాహనం ఆపరేట్ చేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. స్థానిక ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. కార్యక్రమాల్లో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నగర కమిషనర్ శ్రీరాములు నాయుడు, ఏపీసీ స్వామినాయుడు, జిల్లా వైద్యారోగ్య అధికారి రమణ కుమారి, 14వ వార్డు కార్పొరేటర్ రాజేష్, ఇతర కార్పొరేటర్లు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.