అభ్యుదయ కవిత్వానికి పితామహుడు గురజాడ..
Ens Balu
1
Vizianagaram
2020-09-21 14:08:26
మహాకవి గురజాడ అప్పారావు అభ్యుదయ కవిత్వానికి పితామహులని, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి మండలి ఛైర్‌పర్సన్ వంగపండు ఉష కొనియాడారు. సామాజిక దురాచారాలను తన రచనల ద్వారా పారద్రోలిన గొప్ప కవిగా గురజాడకు చరిత్రలో చిరస్మరణీయ స్థానం ఉందని అన్నారు. గురజాడ స్ఫూర్తిని నిలబెట్టు కొనేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పిలుపునిచ్చారు. నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ అప్పారావు 158వ జయింతి ఉత్సవం విజయనగరంలో సోమవారం ఘనంగా జరిగింది. ముందుగా గురజాడ స్వగహంలోని మహాకవి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడినుంచి సత్యలాడ్జి జంక్షన్ వద్దనున్న గురజాడ కాంస్య విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించారు. అక్కడి మహాకవి విగ్రహానికి అతిధులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు గురజాడ దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గురజాడ గొప్పదనాన్ని కొనియాడారు. రాష్ట్ర సంస్కృతి మండలి ఛైర్‌పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ సామాన్య ప్రజల కష్టాలను, వారు పడుతున్న అగచాట్లును తన రచనల ద్వారా తొలగించేందుకు గురజాడ అప్పారావు కృషి చేశారని అన్నారు. బాల్య వివాహాలను ఖండించి, వితంతు వివాహాలను ప్రోత్సహించడం ద్వారా గురజాడ ఒక ప్రజా సంఘసంస్కర్తగా నిలిచారని కొనియాడారు. వాడుకభాషను వ్యాప్తి చేసి, సాహిత్యాన్ని సామాన్యులకు చేరువ చేయడంలో గురజాడ చేసిన కృషి అజరామమని ఉష పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ గురజాడ రచనలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. మహాకవి తన రచనలద్వారా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిఉంటారని కొనియాడారు. గురజాడ విగ్రహం ఉన్న కూడలిని ఆయన పేరుతో అభివృద్ది చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ దూరదృష్టిని కొనియాడారు. సామాజిక చైతన్యమే లక్ష్యంగా గురజాడ తన రచనలను కొనసాగించారని చెప్పారు. గురజాడ నడయాడిన నేలపై పుట్టడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. గురజాడ ఆశయాలను కొనసాగించే బాధ్యత ప్రస్తుత తరంపై ఉందన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ ఏ.గోపాలరావు మాట్లాడుతూ విశ్వమానవ గీతాన్ని రాసిన గురజాడ అప్పారావు విశ్వకవి అని మహాకవి శ్రీశ్రీ కొనియాడినట్లు తెలిపారు. గురజాడను తెలుగువారు తమ జాతీయ కవిగా గుర్తించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పెనుమత్స సూర్యనారాయణరాజు, శాసన సభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, జిల్లా పర్యాటకాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, డిఎస్‌డిఓ ఎస్.వెంకటేశ్వర్రావు, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి డి.రమేష్, డిఇఓ జి.నాగమణి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, ఎంఆర్ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ పరశురామ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, సింహాచల దేవస్థానం పాలకమండలి సభ్యులు రొంగలి పోతన్న, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్ట బాబ్జీ, బిజెపి నాయకులు బి.శివప్రసాదరెడ్డి, వైకాపా నాయకులు ఐ.రఘురాజు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎంవిఆర్ కృష్ణాజీ, గురజాడ విద్యాసంస్థల అధినేత ప్రమీల, గురజాడ వారసులు వెంకటేశ్వరప్రసాద్, ఇందిర, ఇంకా డాక్టర్ వెంకటేశ్వర్రావు తదితర ప్రముఖులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.