స్పందన విజ్ఞప్తులను పరిష్కరించకుండా మొక్కుబడిగా పరిశీలించి మూసివేస్తున్న సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అరుణమ్మ వీధి సచివాలయం, బాలాజీ నగర్ సచివాలయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన కార్యక్రమం విధిగా నిర్వహించాలన్నారు. ఆయా విజ్ఞప్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. కేవలం మొక్కుబడిగా సమస్యను పరిష్కరించినట్లుగా చూపి, ఆయా దరఖాస్తులను మూసివేయడం తగదన్నారు. ఒకే సమస్య మరల మరల స్పందనలో వస్తుందంటే సదరు సమస్యను సక్రమంగా పరిష్కరించలేదని అర్థమన్నారు. స్పందనలో వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి సమస్య మూలాల్లోకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా గృహ నిర్మాణాల పురోగతి గురించి ఇంజనీరింగ్ సహాయకులతో విచారించారు. గృహ నిర్మాణంకు సంబంధించి దశల వారీగా అన్ని దశలలో ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కృషి చేయాలని కోరారు. లబ్ధిదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు కృషి చేయాలన్నారు.
జగనన్న తోడు, చేయూత పథకాల గురించి సంక్షేమ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా పథకాలు ప్రారంభమైన వారం లోపు లబ్ధిదారులు అందరికీ వారి వారి అకౌంట్లో తప్పనిసరిగా నగదు జమ కావాలన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ పరిధిలోని ఆయా పధకాల లబ్ధిదారులందరికీ నగదు జమ అయిందీ, లేనిదీ తెలుసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ఎక్కడా ఎటువంటి జాప్యంను సహించేది లేదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తీరుతెన్నుల గురించి విచారిస్తూ, 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ల వయసు లోపు అందరికీ కోవాక్సిన్ / కోవిషీల్డ్ బూస్టర్ డోస్ అందించాలన్నారు. అందరికీ అవగాహన కల్పిస్తూ 100% పూర్తయ్యేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఓటర్ కార్డు తో ఆధార్ అనుసంధాన ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ విచారించారు. బి ఎల్ వో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వారికి కేటాయించిన ఓటర్లను నిర్దేశిత గడువులోగా ఆధార్ తో అనుసంధానం చేయడానికి ప్రణాళిక వేసుకొని పూర్తి చేయాలన్నారు. ప్రజల నుండి సేకరించిన ఆధార్ సమాచారంను సంబంధిత సూపర్వైజర్లకు జాగ్రత్తగా అందించి భద్రపరచాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమంపై సమీక్షిస్తూ, ప్రతిరోజు సిబ్బంది వారి పరిధిలోని వీధులను విధిగా పరిశీలించాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలకు కూడా వెనుకాడేది లేదన్నారు. పారిశుధ్య నిర్వహణ పై ప్రజలకు నిరంతర అవగాహన కల్పిస్తూ , తడి చెత్త, పోడి చెత్త ను వేర్వేరుగా సేకరించి తరలించాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తదితరులు ఉన్నారు.