ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథుల్లాంటి వారని, వారి సేవలు ఎనలేనవని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. అహర్నిశలూ శ్రమిస్తూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారని కితాబిచ్చారు. ముఖ్యంగా జిల్లాలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ మెరుగైన సేవలందిస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఎంపీడీవోలకు జడ్పీ సమావేశ మందరింలో జడ్పీ ఛైర్మన్ చేతుల మీదుగా శనివారం సత్కార కార్యక్రమం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు సేవలందించి ప్రస్తుతం ఇతర జిల్లాలకు పదోన్నతులపై వెళ్లిన రామచంద్రరావు, సత్యానారాయణ, చంద్రమ్మ, కిరణ్ కుమార్లను ఇక్కడే పదోన్నతులు పొంది సేవలందిస్తున్న రాజ్ కుమార్, లక్ష్మణరావు, సుధాకర్, నిర్మలాదేవి, ఇందిరా రమణ, శారదా దేవిలను జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు భాగస్వామ్యం అవుతూ ప్రజలకు మెరుగైన సేవలందించటంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
ప్రధానంగా ఎంపీడీవో స్థాయిలో ఉండేవారు అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రశంసనీయమైన సేవలందిస్తారని కితాబిచ్చారు. పదోన్నతులు పొందిన వారిని ఇలా సత్కరించుకోవటం మంచి సంప్రదాయానికి నిదర్శనమన్నారు. జిల్లాలో పని చేస్తున్న అధికారులు సమష్టి కృషితో పని చేస్తున్నారని.. దానికి గాను పలు అంశాల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో జరిగే ప్రతి పరిపాలనాపరమైన అంశంలోనూ ఎంపీడీవోలు పాత్ర ఉంటుందని, ప్రభుత్వం అందించే పథకాలను, సేవలను ప్రజలకు దరిచేర్చే అసలైన సమన్వయకర్తలు ఎంపీడీవోలేనని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కితాబిచ్చారు. తను జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఎంపీడీవోలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని రఘురాజు తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం సచివాలయ వ్యవస్థను ప్రజలకు అనుసంధానం చేయటంలో.. సేవలందించటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం... జడ్పీ ఛైర్మన్‌కు సన్మానం
పదోన్నతులు పొందిన ఎంపీడీవోలు, ప్రస్తుత ఎంపీడీవోలు జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఇదే క్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును గజమాలతో వేసి, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అశోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు, జిల్లాలో పని చేస్తున్న వివిధ మండలాల ఎంపీడీవోలు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.