శ్రీకాకుళంజిల్లాలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా వచ్చే నెల 8న చేపట్టనున్న డీ వార్మింగ్ డే పై గ్రామస్థాయిలో చాటింపు వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. డీ వార్మింగ్ మాత్రల వలన ఎటువంటి దుష్పరిణామాలు ఉండబోవని విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. వీటిపై సంబంధిత సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని, డీ వార్మింగ్ రోజున ప్రతి కేంద్రం వద్ద 108 వాహనాలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీ వార్మింగ్ నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా సెప్టెంబర్ 8న నిర్వహించే డి-వార్మింగ్ డే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అమలు జరిగేలా ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు తగు ఆదేశాలు ఇవ్వాలని,అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలని
ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు,జిల్లా విద్యా శాఖాధికారిలను కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి, ప్రాంతీయ తనిఖీ అధికారులు కళాశాలల కరస్పాండెంట్ లేదా ప్రిన్సిపాల్స్ లకు ఆదేశించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు డి వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్ - 400 మీ.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుందని, అంగన్వాడి కేంద్రములలో 1 నుండి 2 సం.ల వరకు అర మాత్ర., 2 నుండి 5 సం.ల వరకు ఒక మాత్ర మరియు 6-19 సం.ల వయస్సు గల స్కూల్స్ కు వెళ్ళని పిల్లలు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా ఈ మాత్రలు వేయించబడతాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత శ్రద్ద వహించాలని కోరారు. ఈ మాత్రలు వినియోగం పట్ల సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని, శిక్షణ నిర్వహించే తేదీలను ముందుగానే తెలియజేయాలన్నారు.
జిల్లాలోని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలు చదువుకునే విద్యార్థులు 4 లక్షల 71 వేల 37 మంది ఉన్నందున అందుకు తగిన విధంగా మాత్రలు, ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో బడికి వెళ్ళని పిల్లల సంఖ్య తక్కువగా ఉందని, వీటిపై మరోమారు పరిశీలించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వైద్యాధికారి పర్యవేక్షణలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 2 నాటికి ఈ మాత్రలు పంపిణీ చేయాలని, ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షకుడుగా నియమించాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సేవా సంఘాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.మీనాక్షి, రాష్ట్రీయ బాల స్వాస్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, , సమగ్ర శిక్ష ప్రోజెక్ట్ అధికారి డా. జయప్రకాష్,ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు కె.ఆనంతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట్రామన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పి.వి.విద్యాసాగర్, డి.ఐ.ఓ ఆర్.వి.ఎస్.కుమార్, ప్రజారోగ్య అధికారి జి.వెంకటరావు, డిసిహెచ్ఎస్ డా.ఎం.ఎస్.నాయక్, డెమో పైడి వెంకటరమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.