తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ , ఎస్టీ ల పై అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా, కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ డా.కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రి కలక్టరేట్ వీసీ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, కమిటీ కన్వీనర్ శోభారాణి లతో కలిసి కలెక్టర్ మాధవీలత నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కేసుల్లో శిక్షలు త్వరిత పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు 53 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్ కేసులను పబ్లిక్ ప్రోసిక్యూటర్ వారీగా సమీక్షించి ఈ కేసుల్లో న్యాయ స్థానాల తీర్పులను పరిశీలించి బాధితులకు న్యాయం జరగని పక్షంలో కేసు పూర్వపరాలను పరిశీలించి అవసరమైతే డివిజన్ బెంచు కేసు వేయాలని కలెక్టర్ సూచించారు. కొవ్వూరు,రాజమహేంద్రవరం డివిజన్ పెండింగ్లో ఉన్న ఎస్సీ , ఎస్టి కేసులకు సంబంధించి వేగవంతం చేయ్యాలని ఆర్డీవోలను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ కేసుల పై సమీక్ష చేస్తూ ఎఫ్ ఐ ఆర్ లు 10, ఛార్జి షీట్ లు 11, దోషిగా నిర్ధారించింది 8 కేసులు ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో మహిళలపై వేధింపుల నివారణకు ప్రతి శాఖలోను ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని శాఖల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని కలక్టర్ సూచించారు. వచ్చే సమావేశం నాటికి పూర్తిస్థాయిలో కమిటీ సభ్యులను నియమించే విధంగా చర్యలు చేపట్టాలని కన్వీనర్ ఎమ్మెస్ శోభారాణిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ(ఎ) సిహెచ్.పాపారావు మాట్లాడుతూ ఎస్సి , ఎస్టి కేసుల విషయంలో ఏ విధమైన వివక్షత లేకుండా కేసులను నమోదు చేసి నింతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలో ఎస్సీ , ఎస్టి కేసుల పై హైకోర్టు స్టేలు ఉన్నాయని , అదే విధంగా కొన్ని కేసుల్లో కుల ధృవీకరణ , మెడికల్ సర్టిఫికేట్లు రావల్సి ఉందన్నారు . ఈ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.
సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎమ్.ఎస్. శోభారాణి, ఇంఛార్జి డి ఆర్ వో కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, రాజమండ్రి ఆర్డీవో ఏ.చైత్ర వర్షిని, అడిషనల్ ఎస్పీ (ఏ)సి హెచ్. పాపారావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్ పి భక్తవత్సలం, డి.ఎస్.పి.ఎ. శ్రీనివాసరావు అడిషనల్ పిపి జి. వెంకట రత్నంబాబు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కేఎన్ జ్యోతి, సిడిపిఓ కే.విజయ కుమారి, డిఆర్డిఎ పిడి ఎస్.డేగలయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి పిఎస్ రమేష్, డీఈవో ఎస్. అబ్రహం, డి ఎమ్ హెచ్.ఓ. డా. ఎన్.వసుంధర తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.