లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల చట్టం నివారణ సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీ సమావేశం పాలకొండ ఏరియా ఆసుపత్రి సమావేశ మందిరంలో శని వారం జరిగింది. ఏదైనా ఆసుపత్రిలో లింగ నిర్థారణ పరీక్షలు నిప్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటిసారి తప్పు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష, 10 వేలు జరిమానా, రెండవ తప్పుకు ఐదు సంవత్సరాల జైలు, రూ.50 వేలు జరిమానా, మూడవసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాల జైలు, వైద్యుని పట్టా నిషేధం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె కోరారు. గ్రామ, మండల స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన సమావేశాలు జరగాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ డి.ఎం.హెచ్. ఓ బి.శ్రీనివాస రావు, వైద్యులు రవీంద్ర కుమార్, భారతి, పద్మావతి, పోలీసు ఇన్స్పెక్టర్ శంకర రావు, న్యాయ నిపుణులు వై. లక్ష్మణ రావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎల్.సంపత్ కుమారి, దుర్గారావు, రమేష్ బాబు, యోగేశ్వర రెడ్డి, సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.