విజయం సాధించేదాకా విశ్రమించవద్దు


Ens Balu
3
Tirupati
2022-08-27 13:12:02

విద్యార్థులు తమకిష్టమైన ఏ రంగంలో అయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి  రజని విద్యార్థినిలకు పిలుపునిచ్చారు  టీటీడీ విద్యాసంస్థ‌ల క్రీడా స‌ల‌హాదారుగా నియ‌మితులైన కుమారి ర‌జ‌ని శ‌నివారం సాయంత్రం టీటీడీ ప‌రిపాల‌న భ‌వనంలో జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా జెఈవో  స‌దా భార్గ‌వి టీటీడీ విద్యాసంస్థ‌ల్లో క్రీడ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, విద్యార్థుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించే దిశ‌గా వారిని ప్రోత్స‌హించాల‌ని ర‌జ‌నికి సూచించారు.జె ఈవో  శ్రీమతి సదా భార్గవి సలహా మేరకు కుమారి రజని శ్రీ పద్మావతి మహిళా డిగ్రి  ,పిజి కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. అనంత‌రం  ర‌జ‌ని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రి, పిజి క‌ళాశాల‌లో విద్యార్థినుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ఆమె మాట్లాడుతూ, తాను తిరుపతిలోనే చదివి నిరంతర శ్రమతో అనేక పరాజ‌యాల నడుమ అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజ‌యం సాధించాన‌ని చెప్పారు. 

తన జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. శ్రీ వేంక‌టేశ్వర స్వామి వారి దయతో తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాన‌న్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగం ఏదైనా అందులో వెంటనే ఫలితాలు రాకపోవచ్చుననే విషయం గుర్తించాలన్నారు. జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా వెనుకంజవేయ‌కుండా లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు మానసికంగా అత్యంత ధైర్యంగా ఉండి సమస్యలను ఎదిరించాలని చెప్పారు.

       తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని పాఠశాల దశలో పిఈటి తనకు హాకిని పరిచయం చేశారని ఆమె తన పాఠశాల స్మృతులను విద్యార్థులకు వివరించారు. 2008లో తాను ఇండియన్ హ‌కీ క్యాంప్ కి ఎంపికైనప్పటికీ ఆడే అవ‌కాశం దక్కలేదని ఆమె చెప్పారు. భాషా పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటి గురించి ఆలోచించకుండా తాను లక్ష్యసాధన దిశగా నిరంతర శ్రమ చేశాన‌న్నారు. 2009లో భారత హాకీ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి న్యూజిలాండ్ లో తాను ఆడానని తెలిపారు. ఆంధ్ర నుండి చరిత్ర సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాల‌న్న తన పట్టుదలే తనను ఈరోజు ఈ స్థాయికి చేర్చగలిగిందని ఆమె వివరించారు.

      2019లో జరగాల్సిన హాకీ ఒలంపిక్స్ కు తాను ఎంపికైనా, కరోనా కారణంగా ఒలంపిక్స్ వాయిదా పడ్డాయన్నారు. ఆ సమయంలో తాను ఆందోళన చెందకుండా మరో ఏడాది పాటు నిరంతరం సాధన చేశానని ఆమె చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తమ లక్ష్యసాధన కోసం చివరి నిమిషం దాకా కష్టపడాలని సూచించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో హాకీలో మెడల్ సాధించాలనుకున్న తన కోరిక నెరవేరి 16 సంవత్సరాల తర్వాత భారతదేశానికి పత‌కంతో తిరిగి వచ్చామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహ‌దేవమ్మ ఆధ్వర్యంలో అధ్యాపకులు రజనిని ఘనంగా సన్మానించారు.  ఈ కార్య‌క్ర‌మంలో అధ్యాప‌కులు  విద్యుల్ల‌త‌, భువ‌నేశ్వ‌రి, ఉష‌, ఉమారాణి పాల్గొన్నారు.