ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వివిధ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ నందు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కొరకు మెరుగైన వైద్య సేవలు అందించే కార్యక్రమం లో భాగంగా షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ ఫండ్ నుంచి 10 కంప్యూటర్లు కొనుగోలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అవసరమైన అనస్థీషియా మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టుల మంజూరు కొరకై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రతిపాదనలు సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
ఆంధ్ర మెడికల్ కాలేజ్ డెవలప్ మెంట్ ఫండ్ నుండి పి.జి రూమ్ మరియు ఈ-లైబ్రరీలను ఆధునీకరించాలని సూచించారు. రోగుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు నాన్-ఎసి రూములకు రూ.400/- ఏసీ రూములు రూ.500/- గా ఉండాలన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి మహా ప్రస్థానం వాహనం ఏర్పాటు చేసుకోవాలని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలిపారు. నాడు - నేడు కింద ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ మెంబర్ డాక్టర్ రవి కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ డి. పుల్లారావు, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి. బుచ్చిరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె. విజయలక్ష్మి, డాక్టర్ టి రమేష్ కిషోర్, డాక్టర్ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.