విజయనగరం జిల్లా నుంచి పులి తన ఆవాసాలకు చేరే వరకు ప్రజలు సంయమనంతో వుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖలోని అటవీ సంరక్షణాధికారి(కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పి.రామ్మోహన రావు కోరారు. ముఖ్యంగా పులి రాత్రి వేళల్లో తెల్లవారు ఝామున సంచరించే అవకాశం వుందని, నాలుగు కాళ్ల జంతువులను ఆహారంగా తీసుకుంటుందని అందువల్ల పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళల్లో ఆరుబయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లా అటవీ అధికారి ఎస్.వెంకటేష్, పార్వతీపురం సబ్ డివిజనల్ అటవీ అధికారి బి.రాజారావులతో కలసి ఇటీవల పులి సంచరించిన పులిగుమ్మి, షికారుగంజి గ్రామాల అటవీ ప్రాంతం, పరిసర గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించి పాదముద్రలు పరిశీలించారు. ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులి స్వతహాగా బిడియ స్వభావం కలిగిన జంతువని, మనుషుల నుంచి సాధ్యమైనంత దూరంగా వుండటానికి ప్రయత్నిస్తూ కనపడకుండా వుండేందుకు ఇష్టపడుతుందన్నారు. ఆకస్మాత్తుగా మనుషుల ఉనికిని గ్రహించినట్లయితే పులి దాడిచేసే అవకాశం వుంటుందన్నారు. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, ప్రజలు ఆరుబయట నిద్రించడం, సంచారం లేని ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని పేర్కొన్నారు.