తెలుగు మాధుర్యాన్ని అందించిన గిడుగు


Ens Balu
8
Srikakulam
2022-08-29 07:25:40

పండితులకు మాత్రమే పరిమితమైన భాషను ప్రజలందరి వాడుక భాషగా రూపుదిద్దేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు, సంస్కర్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు అన్నారు. తెలుగుభాషతో పాటు సవర లిపి కనుగొని భాషోధ్యమానికి చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహుదూర్ అని బిరుదాకింతులు పొందిన కీర్తి గిడుగు సొంతమన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు నూతన విగ్రహాన్ని కమిషనర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాధుర్యాన్ని సామాన్య ప్రజల చెంతకు చేర్చిన ఘనత గిడుగుదే అన్నారు. సరుబుజ్జిలి మండలం పర్వతాల పేటకు చెందిన గిడుగు ఖ్యాతి తెలుగు భాష మాదిరిగా ఖండాంతరాలు వ్యాపించిందన్నారు. 

ప్రభుత్వం మాతృభాషలోని పరిపాలన ప్రజలకు అందించే దిశగా ఎన్నో చర్యలు చేపట్టిందని కమిషనర్ వివరించారు. ప్రజల భాష ఎప్పుడూ సజీవంగా ఉండేందుకు పౌర సమాజం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పరిపాలనలో తెలుగు భాష వాడకం పెరిగిందని కమిషనర్ తెలిపారు. జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, మేనేజర్ రమణ బృందం గిడుగు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విగ్రహదాత, హిందీ ఉపాధ్యాయులు మందపల్లి రామకృష్ణను కమిషన  పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. అలాగే తెలుగు తల్లి వేషధారణలో గాయత్రీ, నృత్య శిక్షకురాలు సుశీల బృందాన్ని మెమెంటో ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర సమన్వయ బృందం సురంగి మోహన్‌రావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్, మహిబుల్లాఖాన్, పొన్నాడ రవికుమార్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, గుత్తు చిన్నారావు, నిక్కు హరిసత్యనారాయణ, తర్జాడ అప్పలనాయుడు తదితరులున్నారు.