విశాఖలో ఘనంగా తెలుగుభాష జయంతి..


Ens Balu
8
Visakhapatnam
2022-08-29 10:35:03

దేశంలో ఎన్ని భాషలు వాడుకలో  ఉన్న తెలుగు భాష తియ్యదనం కలిగిన భాష అని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున  అన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఉడా చిల్డ్రన్ ధియేటర్ లో  తెలుగు భాషా దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా కలెక్టర్  డా. ఏ మల్లిఖార్జున పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాన్ని సరళీకరించి,  తెలుగు భాష తీయ్యదనాన్ని సామాన్యునికి చేరేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులుగారన్నారు. తెలుగు భాష సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా  నిలిచిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. పాఠశాలల్లో, విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు 5 నిమిషాల పాటు ఇంగ్లీషు పదాలు  ఉపయోగించకుండా  మాట్లాడటం, వ్రాయడం వంటి  కాంపిటీషన్స్ నిర్వహించాలన్నారు. ప్రజలు సందర్శించే ప్రదేశాల్లో తెలుగు లో  హోర్డింగులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలుగు అధికార భాష సంఘం అద్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ గ్రాంధిక భాష నుండి సంకెళ్ళు విడిపించి తెలుగు భాష  సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో  వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం అన్నారు. భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి  శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశంలో హిందీ తర్వాత తెలుగు భాష చరిత్ర కలిగిన భాష అని అన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇతర భాషలు  ఎన్ని నేర్చుకున్నా, తెలుగు భాష కమనీయ తియ్యదనం మర్చిపోకూడదన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రాంధిక భాష లో విద్యనభ్యసించినచో సామాన్య ప్రజలకు అర్థం కాదని, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో వాడుకలోకి తెలుగు భాష తీసుకు రావడానికి గిడుగు - పిడుగై సపళీకృతం కాగలిగారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఉన్నంత కాలం తెలుగు భాష ఉంటుందని తెలిపారు.

అంతకు ముందు  జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా  రాష్ట్ర స్థాయి లో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన 44 మంది మహనీయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో  ఎ యూ  వైస్ ఛాన్సలర్ ప్రసాదరావు, ఉడా  చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జెడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర , ఎమ్ ఎల్ సి వరుదు కళ్యాణి,  వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు  కెకె రాజు, చొక్కాకుల లక్ష్మి, మధుసూదనరావు, వంగపండు ఉష, కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జున రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.