విజయనగరం జిల్లాలో వినాయక నిమజ్జన సమయంలో భద్రత దృష్ట్యా ప్రతి సంవత్సరం సూచనలు ఇచ్చినట్లే కొన్నిఈ ఏడాదికి కూడా ఇచ్చినట్టు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా ఎప్పటిలాగే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. వినాయక విగ్రహ ప్రతిష్ట సందర్బంగా కొన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని, ఫైర్, విద్యుత్ శాఖల అనుమతితో పాటు వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు, మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అన్నారు.
పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలని, పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను ఉపయోగించాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని, మండపాల వద్ద క్యూ లను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉందని స్పష్టం చేసారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని, వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు, డీజే వంటివాటికిపైన ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.