స్పందన పరిష్కారంలో నాణ్యత ఉండాలి


Ens Balu
10
Kakinada
2022-08-29 13:42:51

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం స్పంద‌న‌కు వ‌చ్చే ప్ర‌తి అర్జీని నిర్ణీత స‌మ‌యంలో, నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించారు. కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మిల‌తో క‌లిసి  ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో 353 అర్జీలు స్వీకరించారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్ తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఆక్ర‌మ‌ణ‌లు త‌దిత‌రాల అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి ఫొటోల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రెవెన్యూ అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న ఫొటోల‌ను ప‌రిష్కార నివేదిక‌కు జ‌త‌చేయాల‌ని ఆదేశించారు. స్పంద‌న అర్జీల ప‌రిష్కార నాణ్య‌తా ప్ర‌మాణాల త‌నిఖీలో భాగంగా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసే ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ ద్వారా అర్జీదారుల‌కు ఫోన్ చేసి, ప‌రిష్కారంపై అభిప్రాయాలు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. అంత‌కుముందు స్పంద‌న కార్య‌క్ర‌మంలో అర్జీలు ఇచ్చేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే అర్జీదారుల కోసం క‌లెక్ట‌రేట్‌లో చేసిన ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా తో పాటు, స్పంద‌న హాల్‌లో జ‌రిగిన జిల్లాస్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మంలో కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొని.. కొంతసేపు అర్జీల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

ఎస్సీ, ఎస్టీ ప్ర‌త్యేక స్పంద‌న‌కు 32 అర్జీలు:
మధ్యాహ్నం కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.