వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించి సోమవారం ఉదయం కలెక్టరేట్ స్పందన హాలులో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ముఖ్య అతిధిగా హాజరై, జిల్లా అధికారులు, తెలుగు భాషాభిమానులతో కలిసి గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రాంధిక శైలిలో సాగుతున్న తెలుగు భాషా రచన, బోధనలను అందరికీ అర్థమయ్యే వాడుక భాషలోనికి తెచ్చేందుకు గిడుగు వెంకట రామమూర్తి వ్యవహారిక భాషాఉద్యమాన్ని నిర్వహించారని, ఆయన కృషికి వల్లే నేడు విద్య, విజ్ఞానం, సాహిత్యం ప్రజలందరికీ అందుబాటులో వచ్చాయన్నారు. అంతేకాక తన వంటి తెలుగేతర మాతృభాష కలిగిన వ్యక్తులు కూడా సులువుగా తెలుగు భాషను నేర్చుకునేందుకు వాడుక భాష దోహదం చేస్తోందన్నారు.
మన పూర్వ కవులు, భాషావేత్తలు మధురమైన తెలుగు భాషను సుసంపన్నం చేసి వారసత్వ సంపదగా మనకు అందించారని, భాషా పరిరక్షణతో పాటు, భాషా ప్రచుర్యానికి, విస్తృతికి కృషి చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు భాష గొప్పదనాన్ని, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని వివరించి మాతృభాష పట్ల మక్కువ పెంపొందించాలని, కుటుంబాలలో తప్పని సరిగా తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని కలెక్టర్ కోరారు. జీవన అవసరాల కోసం ఎన్ని ఇతర భాషలు నేర్చినా, తల్లి భాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారని, వారందరూ తెలుగు భాష ప్రాచుర్యానికి కృషి చేయడం ముదావహమన్నారు. తెలుగు భాషలో రచనా అనురక్తిని నేటి తరం యువత పెంపొందించుకోవాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం అందించామని తెలిపారు. అలాగే ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యురాలను అధికారులు వ్యవహారిక తెలుగు భాషలోనే సాగించాలని, పాలనా ఫలాలు ప్రజలకు సమగ్రంగా చేరేందుకు ఇది దోహదం చేయగలదన్నారు.
కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించి జిల్లాలో తెలుగు భాషా ప్రాచుర్యానికి విశేష సేవలు అందింస్తున్న కవులు, భాషా వేత్తలను జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఇందులో భాగంగా శతావధాని, విశ్రాంత తెలుగు పండితులు పోచినపెద్ది సుబ్రమణ్యం, కవి, భాషా,సాహిత్య ప్రచారకలు కొరుప్రోలు గౌరినాయుడు, కవయిత్రి, సాహితీ విమర్శకులు డా. కాళ్లకూరి శైలజ లను ఆమె దుస్సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు గిడుగు వెంకట రామమూర్తి చేసిన సేవలను కొరిప్రోలు గౌరినాయుడు, తెలుగు భాషా ప్రశస్తి, మాధుర్యాలను పోచిన పెద్ది సుబ్రమణ్య కవి, ఆధునిక విజ్ఞానం, సాంకేతి పరిజ్ఞానాలను కూడా వాడుక తెలుగు భాషలో భోదించాల్సిన అవసరాన్ని కవయిత్రి డా.కాళ్లకూరి శైలజ వివరించారు.
కార్యక్రమానికి జడ్పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ స్వాగతం పలుకగా, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధరరెడ్డి, బిసి కార్పొరేషన్ ఈఢి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. అనంతరం మద్యాహ్నం కలెక్టరేట్ కు విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగాగీతా విశ్వనాథ్ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించి గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు ఘనంగా నివాళులు అర్పించారు.