గ్రుహ నిర్మాణాలు వేగవంతం చేయాలి


Ens Balu
8
Kakinada
2022-08-29 14:05:06

కాకినాడ జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌థ‌కం కింద చేపట్టిన గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్‌లో హౌసింగ్ నిర్మాణ పనులు, సిమెంట్ సరఫరా, స్టేజ్ కన్వర్షన్, అప్రోచ్ రోడ్లు, క‌ల్వ‌ర్టుల నిర్మాణ పనులు తదితర అంశాలపై హౌసింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సమీక్షించారు. తుని, సామర్లకోట, గొల్లప్రోలు, పెద్దాపురం, పిఠాపురం, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లు, కాకినాడ అర్బన్ కొమరగిరి లేఅవుట్‌కి  సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఇతర అధికారులు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణ పట్టా పొందిన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించి స్టేజ్ కన్వర్షన్ చేసే విధంగా చూడాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన యాప్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు స్టేజ్ కన్వర్షన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ స‌మావేశంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ కె.రమేష్, పెద్దాపురం ఆర్‌డీవో జే.సీతారామరావు, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, ఏలేశ్వరం మున్సిపాలిటీల కమిషనర్లు, కాకినాడ గ్రామీణ మండలాల అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.