గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషాగా తీసుకుని వొచ్చిన సంస్కర్తల్లో అగ్రగణ్యులు గిడుగు రామ్మూర్తి అని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో వాడుక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఇంఛార్జి డీఆర్వో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పూల మాలలంవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వ్యవహారిక వాడుకభాష ఉద్యమానికి ఆద్యులైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి జరుపుకుని ఆయన సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. తెలుగు భాషను వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన సంస్కరణలు బహుముఖ ప్రజ్ఞాశాలి గా గుర్తించాయన్నారు.
ఈరోజు ఆ మహనీయుని జయంతి కార్యక్రమాన్ని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆయనకు ఇవ్వడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఇకపై కలెక్టరేట్ నందు ప్రతి రోజూ "రోజుకో ఒక తెలుగు పదం " వ్యాఖ్య వ్రాయడం కోసం ప్రదర్శన పలక ముందు భాగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అందులో ప్రతి రోజూ ఒక తెలుగు వాక్యాన్ని తప్పనిసరిగా రాయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
సవర భాష కోసం శ్రీకాకుళం వెళ్లి ఆ భాషకు లిపిని తీసుకుని వచ్చి వాడుక భాష ఔనిత్యాన్ని చాటిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహేచ్. శ్రీధర్ పేర్కొన్నారు. తెలుగు భాషను మన పిల్లలకు నేర్పించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను పెంపొందించడం సులభసాధ్యం అవుతుందని ఆయన అన్నారు.