వాకలపూడి పారిశ్రామికవాడలో సోమవారం ప్యారీ షుగర్స్ రిఫైనరీ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇరువురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 60 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. ప్యారీ షుగర్స్ సంస్థ యాజమాన్యంతో కాకినాడ ఆర్డిఓ, కాకినాడ డిఎస్పి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం రాత్రి జరిపిన చర్చలలో మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికీ రూ.40 లక్షల పరిహారం, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్ ద్వారా మరో 5 లక్షలు సొమ్మును చెల్లించేందుకు సదరు సంస్థ ఒప్పంద అంగీకారం సమర్పించిందన్నారు. ఈ మేరకు ఈ దుర్ఘటనలో మరణించిన రాగం ప్రసాద్ (37సం.), తండ్రి రాగం రాంబాబు, రంగప్పచెరువు, గొల్లప్రోలు మండలం, మరోక వ్యక్తి పేరూరి సుబ్రమణ్యేశ్వరరావు (33 సం.), తండ్రి సత్యన్నారాయణ, వట్రపూడి, కె.గంగవరం మండలం కుటుంబాలకు ఒక్కక్కరికీ కంపెనీ అందించే 45 లక్షల పరిహారం, వర్క్సుమెన్ కాంపేషేషన్ చట్టం క్రింద 10 లక్షలు, వై.ఎస్.ఆర్.భీమా పధకం క్రింద 5 లక్షలు వెరసి మొత్తం 60 లక్షలు పరిహారం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే నిబంధన మేరకు మృతుల కుటుంబాల్లోని ఒకరికి కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకరించిందన్నారు.
అలాగే సోమవారం జరిగిన ప్రమాదం నేపద్యంలో ప్యారీ షుగర్ రిఫైనరీ సంస్థలో ప్రమాణిక రక్షణ చర్యలు పాటించకుండా ఆపరేషన్స్ కొనసాగించడం వల్ల కార్మికుల భద్రతకు ముప్పు ఉన్నందున, ఫ్యాక్టరీస్ చట్టం-1948, ఏపి ఫ్యాకరీస్ రూల్స్-1950 లోని సెక్షన్ 40(2) ప్రకారం ధర్డ్ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును దృవీకరించి, తదుపరి ఉత్తర్వులు జారీ చేసి వరకూ పారీ షుగర్స్ సంస్థలో ఆపరేషన్స్ అన్నిటినీ నిలిపి వేస్తూ ఫ్యాకరీస్ శాఖ ద్వారా పొహిబిటరీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.